దేశంలో కరోనా కేసులు 168!

దేశంలో 18రాష్ట్రాల్లో విజృంభిస్తోన్న కొవిడ్‌-19 కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా ఛండీగడ్‌లో కొత్తగా కరోనా వైరస్‌ కేసు నిర్ధారణ అయ్యింది. 23ఏళ్ల యువతి గత ఆదివారం లండన్‌ నుంచి భారత్‌కు చేరుకుంది. మరుసటి రోజు ఆమెలో కరోనా లక్షణాలు భయటపడటంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో కొవిడ్‌-19 ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. ఇలా గురువారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 169కు చేరుకుందని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ ప్రకటించింది. వీరిలో ముగ్గురు మరణించిగా మరో 15మందికి నయం అయింది. ప్రస్తుతం 151మంది కొవిడ్‌-19తో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో 14లక్షల మంది ప్రయాణికులకు స్క్రీనింగ్‌ నిర్వహించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో కొవిడ్‌-19 అధికంగా ఉంది. ఇక్కడ పాజిటివ్‌ కేసుల సంఖ్య 42కు చేరుకుంది. ఇక తెలంగాణలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య 13కు చేరినట్లు రాష్ట్రప్రభుత్వం వెల్లడించింది.


కరోనాపై ప్రధానమంత్రి కీలక ప్రసంగం..


కరోనా కారణంగా దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ప్రధానమంత్రి అధికారులతో ఇప్పటికే పలుసార్లు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అయితే, దేశవ్యాప్తంగా ప్రజల్లో నెలకొన్న భయాలు, అనుమానాల నేపథ్యంలో ఈ రోజు నరేంద్రమోదీ జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. కొవిడ్‌-19ను ఎదుర్కోవడంతో మనదేశం తీసుకుంటున్న చర్యలతోపాటు ప్రజల్లో భరోసా కలిగించేందుకు ఈ రోజు సాయంత్రం  ఎనిమిది గంటలకు నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు.  


సీబీఎస్‌ఈ పరీక్షలు వాయిదా..
కరోనా ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, థియేటర్లు మూతపడ్డాయి. ప్రజలు సమూహాలుగా ఏర్పడకూడదని, ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు నిర్వహించకూడదని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఎస్‌ఈ 10, 12తరగతుల వార్షిక పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 31తరువాత కొత్త తేదీలను ప్రకటిస్తామని పేర్కొంది.