20 రోజుల్లో రూ.3.06 తగ్గిన పెట్రోల్‌


 







ప్రపంచాన్ని వణికిస్తున్న ‘కరోనా’తో ఇంధనం నేల చూపులు చూస్తోంది. పెట్రోల్, డీజిల్‌ ధరలతో పాటు అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. చమురుకు డిమాండ్‌ అధికంగా ఉండే చైనాతో పాటు వివిధ దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తుండంతో ఇంధనంపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ మార్కెట్లో నిల్వలు పేరుకొని పోవడంతో క్రూడాయిల్‌ ధర తగ్గుముఖం పట్టింది. దీంతో పెట్రోల్, డీజిల్‌ ధరలు పైసాపైసా తగ్గుతూ పడిపోయాయి. ఈ నెలలో 20 రోజల్లోనే లీటర్‌ పెట్రోల్‌పై రూ.3.06 , డీజిల్‌పై రూ.3.23 తగ్గాయి.  ప్రస్తుతం హైదరాబాద్‌లో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ.73.97 ఉండగా, డీజిల్‌ ధర లీటర్‌కు రూ.67.82గా ఉంది.  రాబోయే రోజుల్లో మరింతగా తగ్గే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు.


హైదరాబాద్‌ మహా నగరంలో పెట్రో, డీజిల్‌ అమ్మకాలపై కూడా కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. ప్రభుత్వం కరోనా వైరస్‌ విస్తరించకుండా విద్యా సంస్థలు,  సినిమా హాల్స్, పర్యాటక ప్రాంతాలు మూసి వేత, ప్రైవేటు సంస్థలు హోం టు వర్క్‌ ప్రకటించడంతో వారం రోజుల నుంచి పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలపై ప్రభావం పడింది. దీంతో పెట్రోల్‌ బంకులకు వాహనాల తాకిడి లేకుండా పోయింది. వాస్తవంగా మహానగరంలో ప్రతినిత్యం సగటున 45 లక్షల లీటర్ల పెట్రోల్, 34 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్మకాలు సాగుతుంటాయి,  కరోనా దెబ్బకు అమ్మకాలు సగానికి పడిపోయాయి. ఒకవైపు రోజు వారి ధరల తగ్గింపు, మరోవైపు సేల్స్‌ కూడా పడిపోతుండటంతో డీలర్లు ఇంధనం ఇండెంట్‌ కూడా తగ్గించినట్లు తెలుస్తోంది.