అక్రమ కేసులు ఎంతవరకు సమంజసం


జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి, నామపత్రాలు ఉపసంహరించుకునేలా అన్ని రకాల ఒత్తిళ్లూ తీసుకొచ్చిన ఘటనలు చోటుచేసుకున్నాయని భాజపా జిల్లా అధ్యక్షులు రెడ్డి పావని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని, ప్రలోభాలకు లొంగని వారికి అండగా నిలిచినందుకు భాజపా, జనసేన పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం భాజపా, జనసేన జిల్లా నాయకులు కలెక్టరేట్‌ వద్ద నిరసన చేపట్టారు. అనంతరం కలెక్టరు, ఎస్పీలను కలసి వినతిపత్రాలు అందజేశారు. జిల్లాలో జరిగిన పరిణామాలపై సవివరమైన నివేదికను రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయాలని కోరారు. కార్యక్రమంలో భాజపా రాష్ట్ర కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజు, నిమ్మక జయరాజు, జనసేన నాయకులు ఆదాడ మోహనరావు, బగ్గం రాజేష్‌, బూర జగ్గారావు తదితరులు పాల్గొన్నారు.