ఎన్నికల వెనుక రాజకీయ కుట్ర: భాజపా 

దేశంలో ఎక్కడా లేని విధంగా తక్కువ వ్యవధిలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు  నిర్వహించడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్‌ తెలిపారు. జనసేన కార్యాలయంలో సోమవారం భాజపా, జనసేన పార్టీల సంయుక్త ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. మాధవ్‌ మాట్లాడుతూ ఈ ఎన్నికలతో  భాజపా, జనసేన పార్టీలు రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా నిలుస్తాయన్నారు. గ్రామ సచివాలయాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా  రంగులు, ఫొటోలను ముద్రించడానికి విలువైన ప్రజాధనాన్ని వృథా చేశారని మాట్లాడారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రావనే  నెపంతోనే ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు తెరదించిందన్నారు. లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెబుతున్న వైకాపా ఉపాధిహామీ పథకం క్షేత్ర  సహాయకులను, గోపాలమిత్రలను, మీసేవలను తొలగించి లక్షలమంది ఉద్యోగాలు తొలగించి రోడ్డున పడేసిందన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలని అభివృద్ధి కాంక్ష, అవినీతిరహితమైన పాలనకోసం భాజపా, జనసేన పార్టీల కూటమికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పట్టం కట్టాలని  పిలుపునిచ్చారు.  జనసేన, భాజపా నాయకులు పరుచూరి భాస్కరరావు,  సుందరపు విజయకుమార్,  సత్యనారాయణ,  రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.