శాసనసభ ఎస్టీ కమిటీ ఆగ్రహం

ఐటీడీఏలో ఖాళీ, బ్యాక్‌ల్యాగ్‌ పోస్టులపై ఆరా..



గిరిజన ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి పనుల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీని భాగస్వాములను చేస్తూ సమన్వయంతో ముందుకుసాగాలని శాసనసభ ఎస్టీ కమిటీ ఛైర్మన్‌ బాలరాజు అధికారులకు సూచించారు. మన్యంలో రెండు రోజులుగా పర్యటిస్తున్న కమిటీ ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఆయా శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించింది. జేసీ-2 శివశంకర్‌ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఐటీడీఏ పీవో బాలాజీ సమావేశం నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. విశాఖలో మరో కమిటీ పర్యటించనుండటంతో సమీక్షకు కలెక్టర్‌తోపాటు ఆయా శాఖల ముఖ్య అధికారులు హాజరుకాలేదు. బ్యాక్‌లాగ్‌ పోస్టులు, నిధుల మంజూరు, అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర వివరాలు లేకుండా సమీక్షకు అధికారులు రావడంపై కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయ సూచికలో పొందుపరిచిన వివరాలకు, అధికారులు వెల్లడించే వివరాలకు పొంతన లేకపోవడంతో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది