ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె









జిల్లాలో సంచలనమైన సీఎం నిర్ణయం


విజయనగరం జిల్లా చరిత్రలో మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా, మహారాజా అలక్‌ నారాయణ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌(మాన్సాస్‌) ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌గా ఆనందగజపతి కుమార్తె సంచయిత గజపతిరాజును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. తనకు ఇంతటి బృహత్తర బాధ్యతలను అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సంచయిత గజపతిరాజు కృతజ్ఞతలు తెలిపారు. మాన్సాస్‌ ట్రస్ట్‌కు సంబంధించి జరిగిన ఈ పరిణామం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నో ఏళ్లుగా నిరంకుశంగా మాన్సాస్‌పై పెత్తనం చెలాయిస్తున్నవారికి గట్టి దెబ్బ తగిలిందని జనం చర్చించుకోవడం మొదలైంది.


విద్యాభివృద్ధే ధ్యేయంగా మాన్సాస్‌ ఆవిర్భావం








1958లో దివంగత పి.వి.జి.రాజు నెలకొల్పిన మాన్సాస్‌ సంస్థ విద్యా వ్యవస్థను అభివృద్ధి పరిచేందుకు విద్యా సంస్థలను నడుపుతోంది. 1958లో పీవీజీ రాజు వ్యవస్థాపక చైర్మన్‌ కాగా ఆనంద గజపతిరాజు, అశోక్‌ గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు సభ్యులుగా ఉండేవారు. 1994లో పి.వి.జి.రాజు మరణం తర్వాత ఆనంద గజపతిరాజు చైర్మన్‌ అయ్యారు. 2016లో ఆయన మరణం తర్వాత అశోక్‌ గజపతిరాజు చైర్మన్‌ బాధ్యతలు తీసుకున్నారు. అశోక్‌ కుమార్తె అథితి గజపతిరాజు ట్రస్ట్‌ బోర్డు మెంబర్‌గా తెరపైకి వచ్చారు. 13వేల ఎకరాల భూమి, విలువైన ఆస్తులను కలిగిన మాన్సాస్‌ సంస్థ చైర్మన్‌గా, సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఇప్పటి వరకూ ఉన్నారు. బుధవారం ఉదయం సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానానికి వెళ్లి ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. సింహాచలం ట్రస్ట్‌ బోర్డు చైర్‌పర్సన్‌ పదవిని చేపట్టిన మొదటి మహిళగా ఆమెకు ఘనత దక్కింది.