రమేష్‌కుమార్‌ లేఖపై నిజానిజాలు నిగ్గుతేలాలి

రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్‌కుమార్‌ కేంద్రానికి రాసిన లేఖపై నిజానిజాలు తేలాల్సిందేనని రాష్ట్ర ర.భ.శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. మబుగాంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకర్లతో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో ఆదర్శపాలన సాగుతుంటే.. ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ తనకు రక్షణ లేదంటూ కేంద్రానికి లేఖ రాయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. దీనివెనుక తెదేపా కుట్ర దాగిఉందని విమర్శించారు. రమేష్‌కుమార్‌ తనకు విచక్షణాధికారులు ఉన్నాయని, ఎవరినీ సంప్రదించకుండా ఎన్నికలు వాయిదా వేశారని, ఇపుడు ఏ విచక్షణతో కేంద్రానికి లేఖ రాశారని ప్రశ్నించారు. అసలు లేఖ రమేష్‌కుమార్‌ రాశారా, లేదా అన్నది ఆయన ధైర్యంగా ముందుకొచ్చి చెప్పాలని డిమాండ్‌ చేశారు. రమేష్‌కుమార్‌ పేరిట లేఖపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేసి నిజానిజాలు నిగ్గు తేలాలన్నారు. మంత్రితో పాటు వైకాపా నాయకులు పాల్గొన్నారు.