ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలను నియంత్రించాలి

ఆన్‌లైన్‌ విధానంలో ఔషధ విక్రయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలని పార్లమెంటు సభ్యులు బెల్లాన చంద్రశేఖర్‌ లోక్‌సభలో డిమాండ్‌ చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ షెడ్యూల్‌ హెచ్‌, హెచ్‌1, నార్కోటిక్‌, సైకొత్రోపిక్‌ స్టెరాయిడ్స్‌ తదితర హానికర ఔషధాలను కేవలం ప్రత్యేక వైద్య నిపుణుల సూచనల మేరకు మాత్రమే విక్రయించాల్సి ఉన్నప్పటికీ, ఆన్‌ లైన్‌ ఔషధ విక్రయాల ద్వారా ఎటువంటి వైద్యుల సిఫారసులు లేనప్పటికీ విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. వీటితో పాటు లైంగిక సామర్ధ్యం పెంచే ఔషధాలు, స్త్రీలకు సంబంధించిన గర్భ విచ్ఛిత్తి ఔషధాలను ఇ- ఫార్మసీల ద్వారా ఎలాంటి సిఫారసులూ లేకుండా విక్రయిస్తున్నారని సభ దృష్టికి తీసుకు వచ్చారు. వీటిని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో పాటు ఇ- ఫార్మసీల కారణంగా రోగుల వైద్యానికి సంబంధించిన సమాచారం మొత్తం వారికి అందుబాటులో ఉంటుందని, ఇది ఏ ఒక్కరికీ అందించడానికి వీలు లేనప్పటికీ, ఇ- ఫార్మసీల వద్ద ఈ సమాచారం లభ్యం కావడం వల్ల రోగుల ప్రయోజనాలకు భంగం కల్గుతుందని అన్నారు. ఇ- ఫార్మసీ ల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నీ కోరారు