పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో విజయం సాధించి చంద్రబాబుకు అంకితం చేద్దామని తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. పలాస తెదేపా కార్యాలయం వద్ద పట్టణనాయకులు, కార్యకర్తలతో సోమవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు దత్తత నియోజకవర్గంగా పలాస ఉండేదని, ఆయన వారసుడిగా తనను పార్లమెంటుకు పంపించిన ఘనత పలాస నియోజకవర్గ ప్రజలదేనన్నారు. మీరంతా అధిక సంఖ్యలో ఓట్లేసి గెలిపించి ప్రేమను పంచారని, అదే ప్రేమతో మనమంతా రానున్న పురపాలక ఎన్నికల్లో ఒకేతాటిపై నిలబడి తెదేపా అభ్యర్థుల్ని గెలిపించుకుందామన్నారు. నాడు ముఖ్యమంత్రి హోదాలో నారా చంద్రబాబునాయుడు తిత్లీ తుపాను సమయంలో పలాసలోనే రాజధాని పెట్టి మంత్రులు, అధికారులతో సంప్రదింపులు జరిపి అండగా నిలిచారన్నారు. పురపాలక సంఘంలో తెదేపా అభ్యర్థుల్ని గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా అందిద్దామన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండే లేదా మూడు నెలల్లోనే స్థానికసంస్థల ఎన్నికల నిర్వహణ జరపాల్సి ఉంటుందని కోర్టు మొట్టికాయ పెట్టి చెప్పిన తర్వాత హడావుడిగా ఎన్నికలు గందరగోళంగా నిర్వహిస్తున్నారని విమర్శించారు. పలాస నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా సిద్ధంగా ఉంటానన్నారు. కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి తెదేపా హయాంలో చేసిన అభివృద్థి పనులు చెప్పాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ, తెదేపా నాయకులు పి.విఠల్, ఎల్.కామేశ్వరరావు, జి.సూర్యనారాయణ, వి.బాబురావు, జి.కృష్ణారావు పాల్గొన్నారు.
పలాస-కాశీబుగ్గ పురపాలక సంఘంలో విజయం.. ఎంపీ కె.రామ్మోహన్‌నాయుడు