అనర్హులకు ఇళ్లపట్టాలు

ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా గ్రామస్థాయి నాయకులు సంక్షేమ పథకాల పేరిట ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని మండలంలోని నరవ గ్రామానికి చెందిన దళితులు సోమవారం తహసీల్దారు కె.స్వర్ణకుమార్‌కు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన తెదేపా నాయకులు సున్నపు రామస్వామి ఆధ్వర్యంలో సుమారు ముప్పై మంది దళితులు ఇళ్ల మంజూరులో అర్హులను కాదని, అనర్హులకు ఇవ్వడం అన్యాయమన్నారు. ఆర్థికంగా ఉన్నవారికి, ఇళ్లు ఉన్నవారికి మళ్లీ ఇస్తున్నారని మండిపడ్డారు. రేషన్‌ కార్డులు లేనివారికి కూడా మంజూరయ్యాయన్నారు. గ్రామానికి చెందిన వైకాపా నాయకులు ఎన్నికల వేళ, కోడ్‌ అమలులో ఉండగా లబ్ధిదారులకు లాటరీ తీసి ఇంటిస్థలాలు అప్పగిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోపక్క అదే గ్రామనికి చెందిన దళిత నాయకుడు నరవ సన్యాసిరావు మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ ఉండగా కొందరు అధికారులు ఇంటిపట్టాల లాటరీలో పాల్గోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనర్హులకు ఇళ్లపట్టాలు మంజూరు చేశారని రెండు రోజుల కిందట ఫిర్యాదు చేశామని, అది విచారణలో ఉండగా లాటరీ ఎలా తీస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆర్‌ఐ మూర్తికి వినతి పత్రం ఇచ్చారు. ఇదే విషయమై తహసీల్దారు స్వర్ణకుమార్‌ వివరణ కోరగా వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామన్నారు.