కూతురు అమృత అంటే మారుతీరావుకు చచ్చేంత ప్రేమ.. ఆమె కోసం పడరాని పాట్లు పడ్డాడు. జైలు జీవితం గడిపినా.. శిక్ష పడుతుందని తెలిసినా.. కూతురు తనవద్దకు వస్తుందనే ఆశతోనే ఉండేవాడని ప్రతి ఒక్కరి నోళ్లలో ఇదే చర్చ. ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తిరునగరు మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా ఆయన ఇంటి వద్ద గుమిగూడిన ప్రజల నోళ్లలో కూతురు అమృత తన వద్దకు వస్తుందని ఎదురు చూశాడనే చర్చించుకుంటున్నారు. మారుతీరావు మృతదేహం వద్ద ఆయన భార్య గిరిజ ఏడుస్తూ కూడా అమృత తన వద్దకు వస్తుందనే ఎదురు చూసి.. ఇక రాదని తెలిసి ఇలా చేశాడని రోదించింది. చనిపోయే సమయంలో రాసిన సూసైడ్ నోట్‌లో కూడా “ గిరిజా క్షమించు.. అమృత.. అమ్మ వద్దకు వెళ్లు’ అని రాసిన లెటర్ మారుతీరావుకు కూతురుపై ఉన్న ప్రేమను తెలియజేస్తుందని చర్చించుకున్నారు. ప్రణయ్ హత్య కేసుకు సంబంధించిన న్యాయవాది కూడా కూతురు కోసం వేచి చూశాడని పేర్కొన్నారు. శిక్ష తప్పనిసరిగా పడుతుందని తెలిసినా కూతురు తన వద్దకు వస్తే చాలని మారుతీరావు భావించినట్లు పలువురు చర్చించుకుంటున్నారు.
అమృత అంటే చచ్చేంత ప్రేమ