ఆకాశంలోని తొలి సూర్యకిరణం మేఘాలను చీల్చుకుంటూ కాంతివంతంగా దూసుకొచ్చి వెలుగులరేడు పాదాలను తాకింది. ప్రకాశ వంతమైన కాంతిని విరజిల్లుత్తూ సప్త రథాలపై కొలువుదీరిన ప్రత్యక్ష భగవానుని చెంతకు సూర్యుని లేలేత కిరణాలు వెళ్లాయి. ఈ అపురూప సుందరదృశ్యం వీక్షించిన భక్తజనం పులకించిపోయింది. బంగారు ఛాయలోకి మారిన భానుడు కనువిందు చేశాడు. అరసవల్లి సూర్యనారాయణస్వామి మూలవిరాట్టును తాకిన సూర్యకిరణాలు భక్తులకు మంత్రముగ్ధులను చేశాయి. ఈ అపురూప సుందరదృశ్యం సోమవారం ఆవిష్కృతమైంది. ఈ సమయంలో స్వామి బంగారుఛాయలోకి మారి భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యుడు ఉత్తరాయణం మారే సందర్భంగా సూర్యకిరణాలు ఆదిత్యుని పాదాలను తాకి శిరస్సు వరకు వెళ్లాయి. ఉదయం 6.25 గంటలకు కిరణస్పర్శ ప్రారంభమై 6.34 గంటల వరకు స్వామిపై తాకాయి. భక్తులు సూర్యకిరణాలను చూసేందుకు బారులు తీరారు. క్యూలైనులో ఉండే భక్తులు ముందుకు వెళ్తూ సూర్యకిరణాలు తాకే దృశ్యాన్ని వీక్షించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ కిరణ తాకిడిని వీక్షించారు.