నిత్యావసరాల కోసమే బయటకు రావాలి

కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి చర్యల్లో భాగంగా ప్రజలు నిత్యావసరాలకు మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వచ్చేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా అధికారులను ఆదేశించారు. ఆదివారం రాత్రి అమరావతి నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేస్తున్నామని, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు *నిత్యావసరాలు విక్రయించే దుకాణాలు అందుబాటులో ఉంటాయని, వాటి ధరలు పెరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అధికంగా అమ్మితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలన్నారు. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారితో కలిసి తిరిగిన వారు తక్షణమే 104కు ఫోను చేయాలని సూచించారు. కరోనా వ్యాప్తి నివారణకు కృషి చేస్తున్న కలెక్టర్‌, ఇతర అధికారులు, గ్రామవాలంటీర్లకు అభినందనలు తెలిపారు. నగరంలోని నాలుగు వార్డుల పరిధిలో ఉన్న 60వేల మందికి వడబోత పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. వీరిలో ఒక్కరికి మాత్రమే కరోనా అనుమానిత లక్షణాలున్నాయని, అతన్ని ఆసుపత్రిలో చేర్పించామన్నారు. ఏడుగురి నమూనాలను తదుపరి పరీక్షలకు పంపామని చెప్పారు. కరోనా పాజిటివ్‌ కేసు బాధితుడు కోలుకుంటున్నట్లు చెప్పారు. విశాఖ, గంగవరం పోర్టుల్లో కేంద్ర షిప్పింగ్‌ మంత్రిత్వ శాఖ ఆదేశాలు పాటిస్తున్నట్లు చెప్పారు. జనతా కర్ఫ్యూను జిల్లాలో విజయవంతంగా నిర్వహించామన్నారు. సమావేశంలో విశాఖ రేంజ్‌ డీఐజీ రంగారావు, ఎస్పీ బాబూజీ, జేసీలు ఎల్‌.శివశంకర్‌, ఎం.వేణుగోపాల్‌రెడ్డి, పాడేరు సబ్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, శిక్షణ కలెక్టర్‌ ప్రతిష్ఠ, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.