సిపిఎస్ రద్దు చేయాలి...
తమ పార్టీ మానిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పనిసరిగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తి అయింది. 'సిపిఎస్ రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం' అన్నది మొదటి హామీ. అధికారం లోకి వచ్చిన నెల లోగా సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందే పాదయాత్రలో జగన్ మోహన్ రెడ్డి అనేక మార్లు చెప్పారు. కాని రెండు నెలల తర్వాత ఆర్థిక శాఖ, విద్యా శాఖ, పంచాయితీరాజ్ శాఖ, వైద్య శాఖ మంత్రులతో కమిటీ వేశారు. ఆర్థిక శాఖ కార్యదర్శి మెంబర్ కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీ టక్కర్ కమిటీ రిపోర్టును పరిశీలించి ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఆదేశించారు. మంత్రుల కమిటీ సమావేశమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో అధికారులతో మరో కమిటీ వేశారు. అధికారుల కమిటీ మార్చి 31 లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలున్నాయి. జెఏసి, ఫ్యాప్టో, యుటియఫ్ పోరాటాల ఫలితంగా 2019 ఎన్నికల్లో అన్ని పార్టీల ఎజెండాలో సిపిఎస్ రద్దు చేరింది. గత ప్రభుత్వం మాదిరిగా కమిటీలతో కాలయాపన చేయకుండా సిపిఎస్ రద్దు చేయాలి. పాత పెన్షన్ పునరుద్ధరించాలి. ఎన్‌ఎస్‌డిఎల్ కు చెల్లించిన సొమ్ము వెనక్కి రప్పించి ఉపాధ్యాయుల పి.ఎఫ్ ఖాతాల్లో జమ చేయాలి. డిసెంబర్‌లో పిఎఫ్‌ఆర్‌డిఏ ప్రకటించిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 1 లక్షా 88 వేల మంది సిపిఎస్‌లో వున్నారు. 8,167.93 కోట్లు ఎన్‌ఎస్‌డిఎల్‌కు చెల్లించగా దాని వాల్యూ ఇప్పుడు 10,900.66 కోట్లుగా ఉంది. దేశం మొత్తంగా 46.48 లక్షలమంది (సిపిఎస్) ఎన్‌పిఎస్‌లో ఉండగా 1,54,002.24 కోట్లు ఎన్‌ఎస్‌డిఎల్ ద్వారా షేర్ మార్కెట్‌లో ఉంది. దీని విలువ 2,02,047.98 కోట్లుగా ఉంది. సిపిఎస్ (ఎన్‌పిఎస్) ద్వారా లక్షల కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ము షేర్ మార్కెట్‌లో పెట్టి పెన్షన్ గ్యారెంటీ లేకుండా చేశారు. ప్రభుత్వం వేసిన మంత్రుల కమిటీకి టక్కర్ కమిటీ నివేదికను పరిశీలించాలని సూచించారు. అయితే సిపిఎస్ రద్దు చేస్తామని మానిఫెస్టోలో చేర్చి, ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించిన తర్వాత టక్కర్ నివేదికతో పని ఏమిటి? ఇక్కడే అందరికీ అనుమానం కలుగుతోంది! సిపిఎస్ రద్దు చేయాలన్నా, ఉద్యోగులకు పెన్షన్ గ్యారెంటీ ఇవ్వాలన్నా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది అంటూ... ఆర్థిక భారం నుండి ఎలా బయటపడాలో టక్కర్ నివేదిక కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం ఉన్న కాంట్రిబ్యూషన్ కొనసాగించాలి. ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ 10/14/16/18 శాతాలకు పెంచాలని, ప్రతి యేటా సుమారు రెండువేల కోట్లు పెన్షన్ ఫండ్‌కు కేటాయించాలని ఇలాంటి సూచనలు చేసింది. ప్రభుత్వం వీటిపై నిర్ణయం తీసుకోవాలి. చట్టబద్ధమైన రక్షణ కల్పించాలి. పెన్షన్ భిక్ష కాదు-ఉద్యోగుల హక్కు. మాట తప్పనన్న ముఖ్యమంత్రి సిపిఎస్ రద్దు చేయాలి.