స్థానిక ఎన్నికల తరుణంలో సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వానికి తెరలేచింది. 34 జడ్పీటీసీ, 549 ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లకు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జడ్పీటీసీ నామినేషన్లు జిల్లా పరిషత్తు కార్యాలయంలో స్వీకరిస్తారు. ఎంపీటీసీ స్థానాలకు ఎంపీడీవో కార్యాలయంలో దాఖలు చేయాలి. నేటి నుంచి 11 వరకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. 12న నామినేషన్ల పరిశీలన నిర్వహిస్తారు. 13 వరకు అభ్యంతరాల స్వీకరణ అనంతరం 14న మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి అప్పీళ్ల పరిష్కారం, మధ్యాహ్నం 3 గంటల తరువాత నామినేషన్ల ఉపసంహరణ తంతు పూర్తికాగా, బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను వెల్లడిస్తారు. నామినేషన్ల స్వీకరణ, ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ పర్వం మొదలు కానున్న నేపథ్యంలో కలెక్టర్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై రాజకీయపార్టీలతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాజకీయ పక్షాలు అనుసరించాల్సిన విధి విధానాలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి తదితర అంశాలపై చర్చించారు. ఎన్నికల సంఘం చేస్తున్న ఏర్పాట్లను వివరించారు. ఓట్ల లెక్కింపు కోసం డివిజన్ల వారీగా పార్వతీపురం, విజయనగరంలలో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఒకే కేంద్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వేర్వేరు చోట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన ఆయా పార్టీల ప్రతినిధుల సందేహాలను ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అథారిటీ కలెక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ నివృత్తి చేశారు.
ప్రాదేశిక ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
• MURALIKRISHNA RUGADA