corona special wards in vizianagaram

కొవిడ్‌-19పై అప్రమత్తమైన


జిల్లా యంత్రాంగం



కరోనా వైరస్‌పై వైద్యఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలని కలెక్టరు ఎం.హరిజవహర్‌లాల్‌ ఆదేశించారు. కరోనాపై బుధవారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీలంసాహ్ని దూరదృశ్య సమావేశం ద్వారా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అనంతరం కలెక్టరు.. జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. వెంటనే జిల్లాస్థాయి సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌వో రమణకుమారికి ఆదేశించారు. వ్యాధి లక్షణాలు.. వ్యాధి రాకుండా ఏం చేయాలి, వస్తే ఏం చేయాలన్న అంశాలతో సమాచారాన్ని కరపత్రాలు, పోస్టర్లు, హోర్డింగుల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులను, సిబ్బందిని, మందులను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి నాగభూషణ్‌, సూపరింటెండెంట్‌ సీతారామరాజు, వైద్యాధికారులు పాల్గొన్నారు.


విజయనగరం కేంద్రాసుపత్రి, పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రితో పాటు జిల్లా కేంద్రంలోని తిరుమల, వెంకట పద్మ, సాయి పీవీఆర్‌, క్వీన్స్‌ ఎన్‌ఆర్‌ఐ, సాయి సూపర్‌ స్పెషాలిటీ, మువ్వ గోపాలకృష్ణ, నెల్లిమర్ల మిమ్స్‌ ప్రైవేట్‌ ఆసుపత్రి.


వైరస్‌ వ్యాప్తి చెందిన తరువాత వ్యాపార, ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లి తిరిగి వచ్చిన వారిలో జిల్లాకు చెందిన వారు 17 మంది ఉన్నారు. ఇందులో 12 మంది పురుషులు, నలుగురు మహిళలు, ఆరేళ్ల చిన్నారు ఒకరున్నారు. వీరి విషయంలో యంత్రాంగం అప్రమత్తమైంది. ఆరోగ్య పరిస్థితులపై జిల్లా యంత్రాంగం దృష్టిసారించింది. వీరు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా జాగ్రత్తగా ఉండాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్యం విషయమై వాకబు చేస్తున్నారు. 11 మందికి కరోనా లక్షణాలు లేవని తేల్చగా, ఇద్దరు వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ముగ్గురి చిరునామా కోసం వైద్య బృందాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.