మరో పాజిటివ్‌ కేసు

విశాఖ నగరంలో కరోనా పాజిటివ్‌ కేసు మరొకటి నమోదైంది. ఇప్పటికే ఈ వ్యాధితో బాధపడుతున్న 65 ఏళ్ల వ్యక్తి భార్యకూ కరోనా వైరస్‌ సోకిందని పరీక్షల్లో తేలింది. ఆమె వయసు 49 ఏళ్లు. అల్లిపురం ప్రాంతానికి చెందిన ఆయన జెద్దా, మక్కా నుంచి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడి నుంచి ఈ నెల 11న విశాఖ-కాచీగూడ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కి 12న మధ్యాహ్నం విశాఖ వచ్చారు. అప్పటి నుంచి ఆమె తన భర్తతోనే కలిసి ఉన్నారు. ఆయన ఈ నెల 17న ప్రభుత్వ ఛాతీ అంటువ్యాధుల ఆసుపత్రిలో చేరారు. భార్యలో కరోనా లక్షణాలు కనిపించకపోవడంతో ఆమె ఇంట్లోనే ఉన్నారు. ఆ తర్వాత అధికారుల విచారణలో ఆమెకు గొంతునొప్పి ఉన్నట్టు తేలింది. అనుమానం వచ్చి ఈ నెల 20న ప్రభుత్వ అంటువ్యాధుల ఆసుపత్రిలో చేర్పించారు. నమూనాలు తీసి తిరుపతి, ఫుణెకు పంపారు. ఆమెకు పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. నేరుగా విదేశాల నుంచి రాకుండా.. భర్త ద్వారా సంక్రమించిన కేసుగా ఇది నిలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరి కుమార్తె కూడా ఇదే ఆసుపత్రిలో కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నారు. ఈమె రిపోర్టు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఇంకో నలుగురు అనుమానితులు కూడా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. వారి నివేదికలూ రావాల్సి ఉంది.