విజిలెన్స్ కమిషనర్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, సభ్యుల కార్యాలయాలను వెలగపూడి నుండి కర్నూలుకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన చర్యలకు అడ్డుకట్ట పడింది. కార్యాలయాల తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం జనవరి 31న జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ తాళ్లాయపాలెం గ్రామానికి చెందిన రైతు కొండేపాటి గిరిధర్, అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి తిరుపతిరావు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్, ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ..రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
పరిపాలన సౌలభ్యం కోసం అన్ని అంశాల్ని పరిశీలించి కార్యాలయాలు కర్నూలుకు తరలిస్తున్నట్లు జీవోలో ప్రభుత్వం పేర్కొంది. సచివాలయంలో విజిలెన్స్ కమిషనర్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ ఛైర్మన్, సభ్యుల కార్యాలయాల నిర్వహణకు తగినంత స్థలం లేకపోవడం వల్ల వాటిని కర్నూలుకు తరలిస్తున్నామని ఏజీ తెలిపారు. ఆ రెండు సంస్థలు స్వతంత్రమైనవని, వాటి కార్యాలయాల ఏర్పాటు అంశం ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని విచారణ సందర్భంగా ఏజీ చెప్పారు. దురుద్దేశంతో కార్యాలయాలను తరలిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.