gold in sea

బంగారం సముద్రంలోకి..





రామనాథపురం జిల్లా మండపం సమీపంలో శ్రీలంక నుంచి నాటుపడవలో అక్రమంగా తరలించిన 15 కిలోల బంగారు బిస్కెట్లను కోస్ట్‌గార్డ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మండపం సమీపంలోని మరకాయర్‌ పట్టినం ప్రాంతానికి చెందిన ఆషిక్‌, ఫారుఖ్‌ అనే ఇద్దరు యువకులు మంగళవారం శ్రీలంక నుంచి నాటుపడవలో రామేశ్వరం తీరం వైపు వస్తుండగా కోస్ట్‌గార్‌ సిబ్బంది చుట్టుముట్టారు. ఈ క్రమంలో వారు పడవలో ఉన్న బంగారు బిస్కెట్ల పార్శిళ్లను ముయల్‌దీవి వద్ద లోతు తక్కువగా ఉన్న సముద్ర ప్రాంతంలో జారవిడిచారు. కోస్ట్‌గార్డ్‌ సిబ్బంది వారిద్దరినీ అదుపులోకి తీసుకుని రాష్ట్ర సముద్రతీర భద్రతా పోలీసు దళానికి అప్పగించారు. బంగారు బిస్కెట్లను సముద్రంలో జారవిడిచినట్టు విచారణలో గుర్తించి బుధవారం కోస్ట్‌గార్డ్‌, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు గజ ఈతగాళ్లతో ఆ మూడు పార్శిళ్లను వెలికితీశారు. ఆ పార్శిళ్లలో ఉన్న రూ.6.3 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా.. నాగపట్టినం జిల్లా వేదారణ్యం వద్ద తీరంలో రూ.5 కోట్ల విలువైన హెరాయిన్‌ను రాష్ట్ర సముద్రతీర భద్రతా దళం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వేదారణ్యం తీరానికి కొట్టుకొచ్చిన కొయ్యపెట్టెలో ఈ హెరాయిన్‌ ప్యాకెట్లున్నాయి.