రివర్స్ టెండర్లంటూ రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ చేశారని, రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలనను అడ్డుకోవడానికే భాజపాతో జనసేన పొత్తు పెట్టుకుందని జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయాల వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన ప్రాంతీయ సమీక్షా సమావేశం మాధవధార వుడాకాలనీలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయంలో రెండో రోజు మంగళవారం జరిగింది. విశాఖ రూరల్, విజయనగరం జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీకి యువతే బలమన్నారు. జిల్లాల వారీగా ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పార్టీ నాయకులు పోరాటాలు చేయాలని శ్రేణులకు సూచించారు. నవరత్నాల కోసం పేదల భూములు లాక్కొంటున్నారని, భోగాపురం విమానాశ్రయం విషయంలో వైసీపీ నానాయాగీ చేసి, అధికారంలోకి వచ్చాక రహస్య ఒప్పందాలు చేసుకుంటోందన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, సుందరపు విజయకుమార్, కోన తాతారావు, పి.యశస్విని, జి.అప్పారావు, డాక్టర్ రఘుతో పాటు పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
janasena meeting