కరణం మల్లీశ్వరి జీవిత కథ
ఇటు బాలీవుడ్, ఇటు దక్షిణాదిలో బయోపిక్‌లు సందడి చేస్తున్నాయి. స్ఫూర్తివంతంగా నిలిచే వ్యక్తుల జీవితాలను వెండితెరపై ఆవిష్కరణ దర్శక నిర్మాతలకు వాణిజ్య పరంగానూ కలిసొస్తుంది. ఇటు ఎంతోమందికి ప్రముఖ జీవితాలు ఆదర్శంగా నిలిచేందుకు అవకాశం కూడా ఏర్పడుతుంది. ఇప్పటివరకూ రూపొందిన ప్రతి బయోపిక్ కూడా మెప్పించినదే. తెలుగు క్రీడాకారిణి, వెయిట్ లిఫ్టర్ కరణం మల్లీశ్వరి జీవిత కథ కూడా త్వరలో సిల్వర్ స్క్రీప్‌పై ప్రదర్శితం కాబోతుంది. 2000 సంవత్సరంలో ప్రపంచ స్థాయిలో భారతదేశం తరఫున మొదటిసారిగా ఒలిపింక్స్‌లో విజయం సాధించిన మహిళ ఈమె. శ్రీకాకుళంలో జన్మించిన మల్లీశ్వరి ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా నిలవడం వెనుక చాలా కష్టాలే పడ్డారు. ప్రస్తుతం ఈమె ఢిల్లీలో ఉంటున్నారు. కొత్తగా క్రీడా రంగంలోకి వచ్చేవారికి ఈమె జీవితం స్ఫూర్తి. ఇప్పుడు మల్లీశ్వరి కథను యువ దర్శకురాలు సంజనా రెడ్డి సినిమాగా రూపొందించబోతున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ ఏడాది చిత్రీకరణ ప్రారంభించి, అన్ని పనులూ పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాపై ఈనెల 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించకుని అధికారిక ప్రకటన విడుదల చేయబోతున్నారు. కోన వెంకట్, ఎం.వి.వి. సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా ఒకటి వచ్చి చేరనుంది.