మాన్సాస్ ట్రస్టు, సింహాచలం ఆలయ ఛైర్‌పర్సన్‌గా
సంచైత గజపతిరాజు
రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయశాఖకు సంబంధించి మంగళవారం రాత్రి 5 రహస్య జీవోలు జారీచేసింది. అవి దేనిగురించో పేర్కొనలేదు. బుధవారం తెల్లవారేసరికి దివంగత ఎంపీ ఆనందగజపతిరాజు కుమార్తె, భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు సంచైత గజపతిరాజు.. ఆగమేఘాల మీద సింహాచలం దేవస్థానం ఛైర్మన్‌గా ఆ ఆలయంలో ప్రమాణస్వీకారం చేశారు. అక్కడినుంచి నేరుగా విజయనగరం చేరుకొని, ‘మాన్సాస్ ట్రస్టు’ ఛైర్మన్ పదవినీ చేపట్టారు. దీంతో రహస్య జీవోల గుట్టు వీడింది. ఈ రెండింటికీ ఇప్పటివరకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీమంత్రి అశోక్‌గజపతిరాజు ఆనువంశిక ధర్మకర్తగా ఉండగా.. ప్రభుత్వం ఆయన్ను తొలగించి, ఆ స్థానంలో సంచైతను ఛైర్‌పర్సన్‌గా చేసినట్లు స్పష్టమైంది. ఆది నుంచి సింహాచలం ఆలయానికి ఆనువంశిక ధర్మకర్తలుగా, పాలకమండలి ఛైర్మన్‌గా పూసపాటి వంశీకులు కొనసాగుతున్నారు. అశోక్ గజపతిరాజు తండ్రి పీవీజీ రాజు, ఆయన మరణానంతరం పెద్దకుమారుడు ఆనందగజపతిరాజు, ఆయన తదనంతరం 2016 నుంచి అశోక్‌గజపతిరాజు ఛైర్మన్‌గా ఉన్నారు. దాదాపు పదిహేనేళ్లుగా ఆలయానికి పాలకవర్గం లేదు. తాజాగా గతనెల 20న పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అందులో సంచైత గజపతిరాజుకు ఒక సభ్యురాలిగా అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అనూహ్యంగా ఆమెను ఛైర్‌పర్సన్ చేస్తూ మంగళవారం రాత్రి జీవో జారీచేయడం విశేషం.