ఐక్యఉద్యమాలతోనే ఆదివాసీ రిజర్వేషన్ల పరిరక్షణ
ఆదివాసీల రిజర్వేషన్ల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అప్పలనర్స అన్నారు. బుధవారం మండల కేంద్రంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి జె.దీనబంధు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగాల భర్తీలో ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకు రిజర్వేషన్లు కల్పించడం ఆయా ప్రభుత్వాల అభీష్టమని, ఇందులో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఉండదని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం సరికాదన్నారు. ఇది సామాజికంగా వెనుకబడిన తరగతులను కుంగదీసే విధంగా ఉందన్నారు. 2012 సెప్టెంబర్ 5న ఉత్తరఖండ్‌లోని బిజెపి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. ప్రభుత్వం వాదననే కోర్టు పరిగణనలోకి తీసుకోవడమంటే సామాజిక అంతరాలను, వెనకబాటుతనాన్ని విస్మరించి, ఉన్నతవర్గాలను, ఆర్థికంగా ఎదిగిన వారిని సమర్థించేదిగా ఉందన్నారు. అక్షరాస్యత, ఆర్థికాభివృద్ధి అంటూ ప్రభుత్వాలు గొప్పలు చెబుతున్నా, నేటికీ దేశంలో సామాజిక వివక్ష కొనసాగుతోందన్నారు. చదువు, ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు తగినంత ప్రాతినిద్యం రాలేదన్నారు. రిజర్వేషన్ల ఎత్తివేతకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై ఉద్యమించాల్సిన అవసరముందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయాలని, దీనిపై రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. రిజర్వేషన్ హక్కుల సవరణకు ఆస్కారం లేకుండా వాటిని రాజ్యాంగంలో 9వ షెడ్యూల్డ్‌లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. గిరిజనుల హక్కులు, చట్టాలు అమలు చేయలని ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన భూ బదలాయింపు చట్టాన్ని ధిక్కరించిన గిరిజనేతరులపై ఎల్‌టిఆర్ కేసులు నమోదు చేయాలని కోరారు. అరకులోయ గ్యాంగ్ రేప్ ఘటనను గిరిజన సంఘం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. సమగ్ర విచారణ అనంతరం దిశ చట్టాన్ని అమలు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. జిల్లా నాయకులు ధర్మన్నపడాల్, దొర, ధార్మారావు పాల్గొన్నారు.