ఉపమాకలో వెంకన్న ఉత్సవాలు ప్రారంభం
ప్రాచీన పుణ్యక్షేత్రమైన ఉపమాక శ్రీవెంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలు బుధవారం మధ్యాహ్నం 2గంటల 5 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. కల్యాణోత్సవాల్లో భాగంగా భక్తులను స్వామి వారి కల్యాణానికి ఆహ్వానం పలుకుతూ పురవీధుల్లో పెండ్లి కావడి ఉత్సవాన్ని ఆలయ అర్చకులు గొట్టుముక్కల వర ప్రసాదాచార్యుల, కృష్ణమాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పెళ్లి కావిడి ఊరేగించినప్పుడు ఆనవాయితీ ప్రకారం భక్తులు పసుపు, కుంకం, కొబ్బరి బొండాలు సమర్పించారు. అనంతరం సాయంత్రం ఆలయంలో వార్షిక కల్యాణ మహోత్సవం ప్రారంభ సూచికంగా విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, అంతరాలయ పూజలను అర్చకులు నిర్వహించారు. రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వరస్వామిని అశ్వవాహనంపై తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు.
ఏర్పాట్లను పరిశీలించిన సిఐ
వెంకన్న కల్యాణోత్సవ ఏర్పాట్లను సిఐ విజరు కుమార్ బుధవారం పరిశీలించారు. ఏర్లాట్లుపై టిటిడి విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ మహేష్, ఆలయ ప్రధాన అర్చకులు గొట్టుముక్కల ప్రసాదాచార్యులతో చర్చించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయాలన్నారు. క్యూలైన్లను పరిశీలించారు. గతేడాది చాలా మంది భక్తులు ఎండలో క్యూలో నిలబడి ఇబ్బందులు పడ్డారని, గాలిగోపురానికి ఎదురుగా ఏర్పాటు చేసిన రేకుల షెడ్డుకు ఆనుకుని టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కల్యాణోత్సవాలకు విఐపిలు ఎవరైనా వస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఆభరణాలు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలన్నారు. భక్తులు ప్లాస్టిక్ సంచుల్లో కొబ్బరి, అరిటిపండ్లు, పూజా సామగ్రిని తీసుకురావద్దని, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలన్నారు. వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు.