నిబంధనలు సడలించాలని వినతి
జిల్లా వ్యాప్తంగా సుదీర్ఘకాలం పాటు విద్యార్హత ఉండి కూడా తలయారీగాను, గ్రామ సేవకులుగా తక్కువ వేతనాలకు పనిచేస్తున్న వారికి ఉద్యోగోన్నతులు కల్పిండానికి విడుదల చేసిన జిఒ నంబరు 13ను సరిదిద్దాలని గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం జిల్లా ప్రదాన కార్యదర్శి వై అప్పలస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని సన్‌రైజ్ హోటల్లో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్మీడియట్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ అర్హతగా పేర్కొన్నారని, కాని విఆర్‌ఎల్లో ఎక్కువ మంది సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారే ఉన్నారని వివరించారు. ఇదే విషయాన్ని గతంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి, సిఎంఒ కార్యాలయంలో తెలియజేస్తే సడలింపు ఇచ్చేందుకు అంగీకరించారన్నారు.అయితే త్వరితగతిన సడలింపు ఇస్తే ఉద్యోగోన్నతులు పొందడానికి వీలవుతుందని వివరించారు. స్టేట్‌బోర్డు విద్యార్హతను పరిగణలోకి తీసుకుని ఉద్యోగోన్నతి కల్పించాలని కోరారు. రెవెన్యూ మంత్రి ఈ అంశంపై పరిశీలించి ఉద్యోగోన్నతులు కల్పించేందుకు అంగీకరించారు. ఈకార్యక్రమంలో విఆర్‌ఎలు మంత్రిని శాలువ కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వై రామారావు, కొల్లి అబ్బాస్, సింహాచలం, యజ్జల ప్రసాదరావు, సిహెచ్ రామారావు, బి.రాములు, కె.హేమలత పాల్గొన్నారు.