కిక్కిరిసిన రైతుబజార్లు

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావం తాజాగా కూరగాయలపై పడింది. కొవిడ్‌ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఈనెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కూరగాయలు, నిత్యావసరాల కోసం జనాలు పెద్దసంఖ్యలో రోడ్లపైకి వస్తున్నారు. జనాల రాకతో రైతు బజార్లు, పండ్ల మార్కెట్లు, పెట్రోల్‌ బంకులు, సూపర్‌ మార్కెట్లు రద్దీగా మారాయి. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, వరంగల్‌, ఖమ్మం, నిర్మల్‌, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల్లోని రైతు బజార్లు జనాలతో కిక్కిరిసిపోయాయి. 


ఇదే అదునుగా చూసుకున్న దళారులు కూరగాయల ధరలను భారీగా పెంచారు. రైతుబజార్లకు కూరగాయల రాక తగ్గడంతో ధరలను రెండింతలు పెంచి అమ్ముతున్నారు. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జనం ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో రద్దీని నియంత్రించేందుకు పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


మరోవైపు షాపింగ్ మాల్స్ వద్ద ఉదయం 9గంటల నుంచే నగరవాసులు బారులు తీరారు. కరోనా నేపథ్యంలో వినియోగదారులను పరీక్షించిన అనంతరమే లోనికి అనుమతిస్తున్నారు. ఒక్కో వినియోగదారుడి మధ్య కనీస దూరం ఉండేట్లు చూస్తున్నారు.