2 లక్షల నిరుపేదలకు నిత్యావసరాలు


నగరంలో సుమారు 2 లక్షల మంది నిరుపేదలకు నిత్యావసర వస్తువులందించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. వుడా చిల్డ్రన్‌ థియేటర్‌లో ఆయన నగరంలోని పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఒక్కొక్కరికి సుమారు రూ.750 విలువ చేసే కిట్‌ ఇవ్వాలని భావిస్తున్నామన్నారు. ఇందుకు సుమారు రూ. 15 కోట్ల వరకు అవసరమవుతుందన్నారు. జీవీఎంసీ కమిషనర్‌ పేరిట విరాళాలను సేకరించి, ఆ మొత్తంతో నిత్యావసరాలు అందిస్తామన్నారు. విశాఖకు చెందిన పారిశ్రామికవేత్తలు, దాతలు ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం తనకు స్వయంగా రూ.2.67 కోట్లు, కలెక్టర్‌ ద్వారా రూ.2.74 కోట్లను అందించారన్నారు. కలెక్టర్‌ సహాయ నిధికి రూ.4.24 కోట్లను ఇచ్చారన్నారు. దాతల సహకారంతో మరో 10 వ్యాధి నిరోధక నడక మార్గాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. నగరంలో నిబంధనలకు అనుగుణంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించేందుకు సీపీ ఆర్కే మీనా ఇప్పటికే అనుమతులు ఇచ్చారన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.