గ్రామీణ ప్రాంతంలో లాక్‌డౌన్‌ను మరింత పక్కాగా నిర్వహించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పోలీసు అధికారులను విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు ఆదేశించారు. లాక్‌డౌన్ అమలు తీరును ఆయన శుక్రవారం పర్యవేక్షించారు. సబ్బవరం, వెంకన్నపాలెం, చోడవరం, మారకమ్మరేవు తదితర ప్రాంతాల్లో గస్తీ అమలు పరిశీలించారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. చోడవరం స్టేషన్‌ను సందర్శించారు. ఎలాంటి నిర్లిప్తత వద్దని పేర్కొన్నారు. సేఫ్ జోన్‌లో ఉన్నాం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన చెప్పారు. అనకాపల్లి డీఎస్పీ శ్రావణి, శిక్షణ డీఎస్పీ రవికిరణ్ ఉన్నారు.
ప్రజల సహకారంతో పటిష్ఠంగా అమలు: ఎస్పీ బాబూజీ
జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ శుక్రవారం జిల్లాలో ఆకస్మిక పర్యటన చేశారు. విశాఖ నుంచి బయలుదేరిన ఆయన కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లో లాక్‌డౌన్ అమలు తీరును పరిశీలించారు. దేవరాపల్లి-విశాఖ మెయిన్ రోడ్డు, నాలుగురోడ్ల ప్రధాన కూడలి, ఆనందపురం, ఎ.కోడూరు, కె.కోటపాడు, చౌడువాడ గ్రామాల్లో పోలీస్ చెక్‌పోస్టులు పరిశీలించారు. కె.కోటపాడు ఎస్‌ఐ టి.మల్లేశ్వరరావుతో పాటు ఇతర సిబ్బందికి సూచనలిస్తూ ఎలాంటివారైనా లాక్‌డౌన్ విషయంలో సమానమేనన్నారు. పోలీసు అనుమతిలేని వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించవద్దని దేవరాపల్లి ఎస్‌ఐ పి.నరసింహమూర్తిని ఆదేశించారు. పోలీసుస్టేషన్‌కి వెళ్లిన ఆయన సిబ్బంది సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరర ఆయన విలేకరులతో మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో దూరప్రాంతాలకు వెళ్లాల్సిన వాహనాలకు పోలీసుల నుంచి లిఖిత పూర్వకంగా అనుమతి తీసుకోవాల్సిందేనన్నారు. ఎస్.రాయవరం మండలం అడ్డురోడ్డు మార్కెట్ ప్రాంతాన్ని ఎస్పీ తనిఖీ చేశారు. సీఐ విజయ్‌కుమార్, ఎస్సై ధనుంజయ లాక్‌డౌన్ నిబంధనల అమలుతీరును ఎస్పీకి వివరించారు.