మొత్తం 722కి చేరిన సంఖ్య
రాష్ట్రంలో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే కొత్తగా 75 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒకరోజు వ్యవధిలో ఇన్ని ఎక్కువ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల మధ్య నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 75 కొత్త కేసులు బయటపడ్డాయి. వీటిలో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 20, కర్నూలులో 16, కృష్ణాలో 5, అనంతపురంలో 4, కడపలో 3, తూర్పుగోదావరి జిల్లాలో 2 కేసుల చొప్పున నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 722కి చేరింది. కరోనాతో మరణించిన వారి సంఖ్య 20కి చేరింది. ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన బులెటిన్‌లో 17 మంది చనిపోయినట్టు పేర్కొంది. కర్నూలులో ఒక వృద్ధుడు, అనంతపురం జిల్లాలో ఒక ఏఎస్సై ఆదివారం చనిపోగా.. ఆ వివరాల్ని ప్రభుత్వం సోమవారం బులెటిన్‌లో ప్రకటించింది. కృష్ణా జిల్లాలో సోమవారం ఒకరు మరణించారు. ఈ ముగ్గురితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 20కి చేరింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కర్నూలు జిల్లాలో నమోదైన 16 కేసుల్లో 14 నంద్యాల పట్టణంలోనే ఉన్నాయి. వీటితో కలిపి నంద్యాలలో ఇంత వరకు నమోదైన కేసుల సంఖ్య 39కి చేరింది. గుంటూరు జిల్లాలో నమోదైన 20 కేసులూ నరసరావుపేటలోనే ఉండడం గమనార్హం.