ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఇవాళ ఉదయం 9గంటల వరకు కొత్తగా 9 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ నమోదైన కేసుల్లో కృష్ణా జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 3, పశ్చిమగోదావరి జిల్లాలో 3 కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బులిటెన్‌లో తెలిపారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 534కు చేరింది. ఇప్పటి వరకు కరోనాతో రాష్ట్రంలో 14 మంది మృతి చెందగా, 20 మంది కోలుకున్నారు. వివిధ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 500 మంది చికిత్స పొందుతున్నారు.
ఇప్పటి వరకూ మూడు విడతలుగా సర్వే నిర్వహించిన అధికారులు 32 వేల మందికి పైగా అనుమానితులను గుర్తించారు. వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏఎన్‌ఎంతో పాటు ఆశా కార్యకర్త, వైద్య సిబ్బంది సాయంతో ఇంటింటికీ వెళ్లి నమూనాలు సేకరించనున్నారు. కంటైన్‌మెంట్ జోన్లు, రెడ్ జోన్లలో ప్రత్యేకంగా కుటుంబ సర్వే నిర్వహించాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది.