కొట్టిన ఎస్సై సస్పెన్షన్
పోలీసు లాఠీ దెబ్బకు సామాన్యుడి గుండె ఆగిన సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మృతుడి తండ్రి తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని వెంకటపతినగర్‌లో నివసిస్తున్న షేక్ మహమ్మద్ గౌస్ (35) ఉదయం 8 గంటలకు తాలుకా సెంటర్‌కు వచ్చి మందులు తీసుకొని ద్విచక్రవాహనంపై తిరిగి వెళుతున్నాడు. నరసరావుపేటరోడ్డులోని చెక్‌పోస్టు వద్ద ఎస్సై డి.రమేష్ అతణ్ని అడ్డుకున్నారు.
అతడి వద్ద ఉన్న ఔషధాలను పరిశీలించకుండానే బజారుకు ఎందుకు వచ్చావంటూ లాఠీతో వీపుపై బాదారు. దీంతో గౌస్ కుప్పకూలిపోయారు. సమాచారం తెలియగానే బాధితుడి తండ్రి ఆదం వచ్చి కుమారుడ్ని ఆటోలో ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ గౌస్ మృతి చెందారు. టింబర్ డిపో నడుపుతున్న గౌస్ హృద్రోగంతో బాధపడుతున్నారు. 11 ఏళ్ల క్రితం అతడికి ఓపెన్‌హార్ట్ సర్జరీ చేశారు. ఎస్సై కొట్టిన దెబ్బలకు గుండె పైభాగంలో వేసిన కుట్లలో నుంచి రక్తస్రావమైనట్లు మృతుడి తండ్రి ఆరోపించారు. గౌస్ కుటుంబానికి న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ప్రజలు మృతదేహంతో పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే అంబటి రాంబాబు తరఫున ఆయన సోదరుడు మురళి ఇచ్చిన హామీ మేరకు వారు నిరసన విరమించారు. అనంతరం తహసీల్దార్ సమక్షంలో శవపంచనామా నిర్వహించారు. శవపరీక్షను వీడియో చిత్రీకరించారు. గౌస్ మృతికి కారణమైన ఎస్సైపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామీణ ఎస్పీ విజయారావును కోరామని ఎమ్మెల్యే అంబటి రాంబాబు మీడియాకు వెల్లడించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ కె.చక్రవర్తి పేర్కొన్నారు.