బ్యాంకుల వద్ద చెదురుతున్న వ్యక్తిగత దూరం


కరోనా కోరలు చాస్తున్న వేళ నిరుపేదలు, కూలీల కుటుంబాలను ఆదుకునేందుకు వారి బ్యాంకు ఖాతాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు జమ చేశాయి. ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద జన్‌ధన్‌ ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం తొలివిడతగా రూ.500 జమ చేసింది. రాష్ట్రంలోని 74 లక్షల మంది తెల్ల రేషన్‌ కార్డుదారుల ఖాతాల్లో మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 చొప్పున నగదు జమ చేసింది. మరో 13.54 లక్షల మంది కార్డుదారుల ఖాతాల్లో త్వరలోనే జమచేస్తామని ప్రకటించింది. ఈ డబ్బులతో కొన్ని రోజులైనా ఉపశమనం పొందాలన్న ఆశతో బ్యాంకులకు పెద్దసంఖ్యలో జనం తరలిరావడం.. వ్యక్తిగత దూరం పాటించకపోవడం అసలుకే ముప్పు తెచ్చేలా ఉంది. లాక్‌డౌన్‌ను మే నెల 3 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో నగదు తీసుకునేందుకు బుధవారం బ్యాంకులు, ఏటీఎంల వద్దకు పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. కొన్ని బ్యాంకుల వద్ద జనం వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పాట్లు చేయలేదు. గుంపులు గుంపులుగా జనం కనిపించారు. లాక్‌డౌన్‌ ప్రకటించిన తరువాత ఓ బ్యాంకు శాఖలో రోజుకు 10-15 లావాదేవీలు జరగగా.. బుధవారం ఒక్కరోజే దాదాపు 100 లావాదేవీలు నమోదయ్యాయి. నగదు జమయిన తరువాత తీసుకోకుంటే వెనక్కు వెళ్లిపోతుందంటూ సామాజిక మాధ్యమాల్లో జరిగిన అసత్య ప్రచారాలతో జనం ఎక్కువగా వచ్చినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.